Posts filed under ‘RK’

Leaving Microsoft To Change The World

Originally Published on pustakam.net

మనందరికీ గెలవడం చాలా ఇష్టం. గెలిచిన వారంటే ఆరాధన. ఏమీ లేని స్థాయి నుంచి ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ, ఒక్కొక్క సవాలునీ అధిగమిస్తూ చివరికి విజయాన్ని చేరుకునే కథలు ఏవో కిక్కునిస్తాయి. అందుకే నవలల్లోను, కథల్లోను, సినిమాలలోను underdog winning ఇంకా ఒక హిట్ ఫార్ములా.

ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకోబోయే వ్యక్తి ఆయన రాసిన పుస్తకం వీరితో అనుసంధానితమైన కథ సరిగ్గా ఈ ఫార్ములా కు ఒక రకం గా చూస్తే వ్యతిరేకం. ఆ వ్యక్తి పేరు జాన్ వుడ్. పుస్తకం పేరు Leaving Microsoft to Change the World. అనుసంధానితమైన కథే Room to Read. వివరంగా చెబుతాను:

35 సంవత్సరాల వయసులో ఒక వ్యక్తి తనకు ఏమేం కావాలని కలలు కంటాడో అవన్నీ జాన్ వుడ్ దగ్గర ఉన్నాయి. Kellog School of Management (Northwestern University) లాంటి పేరు మోసిన యూనివర్సిటీ నుంచి MBA డిగ్రీ, మైక్రోసాఫ్ట్ లాంటి ప్రశస్థ మైన కంపెనీ లో Director of Business Development గా ఉద్యోగం. విలాసాలను సులభం గా అందివ్వగల జీతం, బిల్ గేట్స్(మాజీ CEO) , స్టీవ్ బామర్ (ప్రస్తుత CEO ) లతో చనువు. కార్పొరేట్ ప్రపంచం లో గుర్తింపు. ఇలాంటి జీవితాన్ని త్యజించాలని ఎవరికీ కలలో అయినా అనిపించదు. జాన్ వుడ్ సరిగ్గా ఇదే చేసాడు.

1998 లో పని ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం, కార్పొరేట్ అడవినుంచి సాధ్యమైనంత దూరంగా వెళ్ళాలని జాన్ వుడ్ ఒక సారి నేపాల్ విహార యాత్రకు వెళ్లాడు. తను బస చేసిన హోటల్ దగ్గర ఒకరోజు యాదృచ్ఛికంగా ఒక ప్రాంతీయ పాఠశాలల ఇన్స్పెక్టర్ ను కలుస్తాడు. మాటా మాటా కలిసి స్నేహితులవుతారు. ఇన్స్పెక్టర్ మాటల్లో నేపాల్ ప్రాధమిక విద్యా వ్యవస్థ యొక్క దయనీయమైన స్థితి గూర్చి వింటాడు జాన్ వుడ్. టూరిస్టులకు సహజంగా ఉండే ఉత్సుకతతో మరుసటి రోజు ఆ ఇన్స్పెక్టర్ తో కలిసి ఒక మారుమూల పాఠశాలను సందర్శించాలని అనుకుంటాడు.

అక్కడ తెలుసుకున్న విషయాలు ఆ సంఘటనా జాన్ వుడ్ జీవితాన్ని సమూలం గా మార్చేసాయి. ఆ పాఠశాలలో కూర్చోవడానికి డెస్కులు లేవు. వర్షం పడితే పైభాగం నుంచి నీళ్ళు కారతాయి. రాసుకోవడానికి బోర్డులు లేవు. చదువుకోవడానికి పుస్తకాలు లేవు. ఉన్నదల్లా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న అమాయకమైన పిల్లలు. ఇలాంటి దయనీయమైన పరిస్థితులు చూసిన జాన్ నేపాల్ లో 70% మంది ఇంకా ప్రాధమిక విద్య కు దూరం గా ఉన్నారని తెలుసుకుని సహజం గానే షాక్ తిన్నాడు. అదే విషయాన్ని అక్కడి ప్రధానోపాద్యాయుడితో మాట్లాడినప్పుడు, ఇక్కడ చదువుకోవడానికి పుస్తకాలు కూడా లేవా అని ప్రశ్నించినప్పుడూ వచ్చిన సమాధానం అతని జీవితం లో అసలైన మలుపు – ప్రధానోపాద్యాయుడు నవ్వుతూ -”మీరు ఈ సారి వచ్చినప్పుడు పుస్తకాలు ఇద్దురు గాని” అన్నాడు.

తిరిగి అమెరికాకు వెళ్ళిన తర్వాత కూడా జాన్ వుడ్ ను ఈ సంఘటన, ఆ సమాధానం వెంటాడుతునే ఉంది. తన బాల్యాన్ని, అభాగ్యులైన అక్కడి పిల్లల బాల్యంతో పోల్చి చూసుకున్నాడు. తన ప్రస్థుత పరిస్థితిని గూర్చి ఆలోచించాడు. గొప్ప కంపెనీలో ఉద్యోగం, ఖరీదయిన ఫ్లాట్, డిజైనర్ గర్ల్ ఫ్రెండ్…ఒక్కసారి గణాంకాల వేపు దృష్టి సారించాడు. అధికారిక లెక్కల ప్రకారం ప్రపంచంలో ఇంకా 85 కోట్ల మందికి ప్రాధమిక విద్య లేదు. పూర్తిగా నిరక్షరాస్యులు. 10 కోట్లమంది పాఠశాలలకు వెళ్ళాల్సిన పిల్లలు వెళ్ళలేరు. అలా కొంతకాలం తర్జన భర్జనలు పడినతర్వాత జాన్ వుడ్ నిర్ణయం తీసుకుంటాడు. ఉద్యోగానికి, గర్ల్ ఫ్రెండు కు, కార్పొరేట్ ప్రపంచానికీ, ఖరీదయిన జీవన విధానానికీ స్వస్తి చెప్పి, తనను ఇంతగా కదిలించిన ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యం తో Room to Read అనే non profit organization  ను మొదలుపెట్టాడు. ఇక ఆతర్వాత జరిగిందంతా చరిత్ర. నేపాల్ లో తమ కార్యాచరణ మొదలుపెట్టిన ఈ సంస్థ ఈ రోజు వియత్నాం, కంబోడియా, ఇండియా, లావోస్, శ్రీలంక, సౌత్ ఆఫ్రికాల కు విస్తరించింది. ఉత్తేజితుడైన ఒక్క వ్యక్తి ప్రారంభించిన ఈ ఆర్గనైజేషన్ ఈరోజు ప్రపంచవ్యాప్తం గా ఒక మిలియను కంటే ఎక్కువ పుస్తకాలతో 3000 లైబ్రరీలను నెలకొల్పింది. సవివరం గా మీరు దాని గూర్చి ఇక్కడ చదవచ్చు.

ఏదో పుస్తకం పరిచయం చేయబోయి ఇదంతా ఎందుకు చెబుతున్నాను అని మీరు ఆలోచిస్తున్నట్లయితే – నేను పైన చెప్పిన విషయాలే మీకు నేను పరిచయం చేయాలనుకున్న పుస్తకం. ఈ పుస్తకం వీటి గురించే మాట్లాడుతుంది. పైన చెప్పిందంతా నా మాటల్లో అయితే, పుస్తకంలో జాన్ వుడ్ మాటలు. అమెరికా నుంచి నేపాల్ పేద పిల్లల వరకు, Corporate Warrior నుంచి Philanthropist వరకు రెండు పరస్పర విరుద్ధమైన ప్రపంచాలను తన అనుభవాల ద్వారా, ఆసక్తి రేకెత్తించే, నిజాయితీ తో కూడుకున్న కథనం ద్వారా జాన్ వుడ్ పరిచయం చేస్తాడు. నేను ఇటీవలి కాలంలో మొదటి పేజీ నుంచి, చివరి పేజీ వరకు ఆపకుండా చదివిన్ అతి కొన్ని పుస్తకాల్లో ఇది ఒకటి. సమాజం పట్ల తన బాధ్యతను గుర్తెరిగిన వాళ్ళు, సమాజం నుంచి తీసుకోవడం మాత్రమే కాకుండా తిరిగి ఏదయినా ఇవ్వాలి అన్న స్పృహ ఉన్నవాళ్ళు, ఎన్నో చెయ్యాలని ఉద్దేశాలున్నా ధైర్యం చాలక మిన్నకున్నవాళ్ళూ తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది. ఇవేమీ లేకుండా మంచి పుస్తకాన్ని చదివితే వచ్చే అనుభవాన్ని ప్రేమించే వాళ్ళూ ఇది చదివి దీన్ని ఇష్టపడతారు. మార్క్ ట్వెయిన్ చెప్పినట్లు: Truth is stranger than fiction because fiction is obliged to stick to possibilities; Truth isn’t!

నా(మన) దేశానికి ఇలాంటి జాన్ వుడ్ లు వేలల్లో కావాలి …. అన్న ఆలోచనతో ఈ వ్యాసాన్ని ముగిస్తున్నాను.

ఈ పుస్తకాన్ని ఇక్కడ కొనవచ్చు
సంబంధిత లింకులు:   పుస్తకం అధికారిక సైటు బ్లూంబర్గ్ తో ఇంటర్వ్యూ

ఈ కోవకు చెందినదే ఇంకో పుస్తకం:Three Cups of Tea

January 24, 2009 at 3:27 pm Leave a comment

Letters of Swami Vivekananda

Originally Published on pustakam.net

వివేకానందుడి గూర్చి చెప్పాలంటే ఎక్కడ ప్రారంభించాలో, ఎక్కడ ముగించాలో అర్థం కాదు. జ్ఞాపకాలు, అనుభవాలు అనుభూతులు ఒకటా రెండా! పేరు వినగానే నరాల్లో రక్తం పరుగులు తీస్తుంది. చిమ్మ చీకటిని నిట్టనిలువునా చీల్చే విద్యుల్లతనొకదానిని మానవ శరీరం లో బంధించారేమో అన్నట్లుండే రూపం,విషయాన్ని చూడగానే దాని మర్మాలను తెలుసుకోగల అపారమైన మేధస్సు, చేతిలో చిల్లిగవ్వకూడా లేకున్నా ఒక గొప్ప సంస్థను నిర్మించిన కార్యదక్షత, నమ్మినవాటికోసం ప్రపంచం మొత్తాన్ని ధిక్కరించి నిలబడగల సత్తా… నిద్రాణమైన ఒక జాతిని మొత్తము పునరుత్తేజితం చేసిన వ్యక్తిత్వం… వెరసి వివేకానందుడొక అద్భుతం.

వివెకానందుడినీ, ఆయన రచనలని పరిచయం చేయబోవటం సాహసమే అవుతుంది. పరిచయాలు అఖ్ఖర్లేని వ్యక్తి వివేకానందుడు. అయినా, ఆయన మీద వెలువడిన ఒకానొక పుస్తకంతో నా అనుభవాన్ని పంచుకునే ఉద్దేశ్యమే ఈ వ్యాసం. ఆ పుస్తకమే Letters of Swami Vivekananda (వివేకానందుని ఉత్తరాలు). వివేకానందుడు తన జీవితకాలంలో తన సహచరులకు, స్నేహితులకు, విద్వాంసులకు, శిష్యులకు మొదలగు వారికి రాసిన ఉత్తరాలలో అందుబాట్లో ఉన్న ఉత్తరాల సంకలనమే ఈ పుస్తకం. ఇది ఒక రకం గా వివేకానందుని ఆత్మకథ. ఉత్తరాలు ఆలోచనలు అడ్దంకులు లేకుండా ప్రవహించే చోటు. ఉత్తరాలు మనిషి సంతోషాన్ని, వ్యధను, కోరికలను ఆశయాలనూ భేషజాలు లేకుండా వ్యక్తపరిచే చోటు. వ్యక్తి గూర్చి తెలుసుకోవడానికి ఇది ఎంత మహదావకాశం? ఇక పుస్తక వివరాల్లోకి వెళితే…

అద్వైత ఆశ్రమం వారు ఈ పుస్తకాన్ని వివేకానందుడు రాసిన ఉత్తరాలనన్నింటిని తేదీల సహాయంతో ఒకదాని తర్వాత ఒకటి అమర్చి ప్రచురించడం వల్ల ఆయా సమయాల్లో ఆయన మనఃస్థితి మనకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. అదే ఈ పుస్తకంలోని సౌందర్యం. పండితులతో తార్కిక వాదనలు, విద్వాంసుల నుంచి సందేహ నివృత్తి, తనతో పాటుగా రామకృష్ణుని పాదాల వద్ద కూర్చున్న సహచరులతో సమాలోచనలు, తన వ్యక్తిత్వానికి ఆకర్షితులైన రాజులు, జమీందారులు, సామాన్యులు మొదలగు వారికి దిశా నిర్దేశాలు, అక్కడక్కడా కవిత్వం వెరసి ఇది తన సొంత అక్షరాలతో చిత్రించిన జీవనచిత్రం.

అధికశాతం ఉత్తరాలు ఆంగ్లంలోనే రాసినా, బెంగాలి లో రాసిన ఉత్తరాలనుకూడా అద్వైతాశ్రమం వారు ఆంగ్లంలోకి అనువదించారు. చదవటం మొదలుపెట్టిన తర్వాత అన్నింటికంటే మొదటగా పాఠకుడిని ఆకర్షించేది వివేకానందుడి కి భాష మీద ఉన్న పట్టు. పదాలతో ఆయన గారడీ చేస్తాడు. కళ్ళతో చదివి మెదడుతో విశ్లేషించేలోపు విషయం గుండెను తాకుతుంది. హిందూయిజం గూర్చి మాట్లాడుతూ – “No religion on earth preaches the dignity of Humanity in such a lofty strain as Hinduism, and no religion treads on the necks of the poor and low in such a fashion as Hinduism” (మానవజాతి ఉన్నతిని హిందూయిజం లాగా మహోన్నతంగా మరే ఇతర మతమూ బోధించలేదు, అలాగే పేద నిమ్న వర్గాల ప్రజల కుత్తుకల మీద హిందూయిజంలాగా నడిచెళ్ళిన మతమూ లేదు. — ఇది స్వేచ్ఛానువాదం.) తన సన్నిహితులకు రాసిన ఇంకొక ఉత్తరంలో తన గురించి ఏమంటాడో చూద్దాం: “I will tell you what is to my taste; I cannot write and I cannot speak, but I can think deeply, and when I am heated, can speak fire” -ఎంత నిజం! అసలు పరిచయమే లేని ఇంకొక కొత్త సమాజానికి(అమెరికా) కు వెళ్ళి, అక్కడి తన మొట్టమొదటి ప్రసంగంలో, మొదటి మాటను(”Brothers and sisters of America”) వినగానే అంత అపూర్వమైన స్పందన ఎందుకువచ్చి ఉంటుంది? ఇంతకు ముందు సోదర సోదరీమణులారా అన్న ప్రయోగాన్ని ఎవ్వరూ వాడలేదా? వాడారు. కానీ మాట్లాడే వ్యక్తి వ్యక్తిత్వం యొక్క గొప్పదనం, ఎదుట ఉన్న అశేష జన సమూహాన్ని నిజంగానే సోదర సోదరీమణులని అనుకున్న సంస్కారం ఆ మాటలకు అంతటి బలాన్ని, ఆకర్షణనూ ఇచ్చాయి.

నన్నాకర్షించిన మాటలన్నీ ఇక్కడ రాయాలంటే అదో చిన్నపాటీ పుస్తకం అవుతుంది. ఈ వ్యాసపు ఉద్దేశ్యం అది కాదు కాబట్టి నన్ను నేను అదుపు చేసుకుంటున్నా. ఒక్క విషయం మాత్రం చెప్పగలం. వివేకానందుణ్ణి చదవటం అంటే భారత దేశాన్ని గురించి చదవడం. ఋషుల్లో కి ఋషి, బుద్ధుడిలా అపారమైన జాలి కలిగిన వాడు, శంకరుని లా అద్భుతమైన మేధస్సు గలవాడు… ఈ రెండింటి కలయిక ఇంతకుముందెన్నడూ ఒకే వ్యక్తి రూపంలో సంభవించలేదేమో అనటం అతిశయోక్తి కాదు. ఓ ఆరు సంవత్సరాల క్రిందట మొదటి సారిగా ఈ పుస్తకాన్ని చదవడం మొదలుపెట్టినరోజు నా జీవితాన్ని ఈ పుస్తకం ఇంత సమూలంగా మార్చేస్తుందన్న ఊహలేదసలు. పేజీ తర్వాత పేజీ అజ్ఞానపు పొరలను ముక్కలు ముక్కలు చేస్తూ వివేకానందుడు!

“భారత దేశం Third world country . “కులవ్యవస్థ” దేశానికి పట్టిన చీడ. భారతీయులు అధికశాతం అనైతిక జీవులు. బ్రాహ్మణులు సమజాన్ని ఎప్పుడో పీడించారు. అవినీతి వెళ్ళూనుకుపోయింది. భారతీయుల పురాణాలు పెద్ద జోక్! జ్యోతిషశాస్త్రం, వాస్తు లాంటి “నిర్హేతుక” భావాలను అంటిపెట్టుకుని జీవిస్తారు భారతీయులు…..” పద్దెనిమిదేళ్ళ పాఠశాల చదువు తర్వాత నా ధోరణి అది. సంస్కృతి మనిషికి ఇచ్చే అనుభవాలు కూ, పాఠశాలల్లో బోధింపబడే “విజ్ఞానం” అనబడే దానికి అసలు పొంతనలేకుంటే అలాంటి వ్యవస్థలో నుంచి ఉద్భవించిన సగటు భారతీయ విద్యార్థినే నేను. ఆ నేపథ్యంలో చదివిన ఈ పుస్తకం నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నేను చూసే విధానాన్ని మార్చేసింది. మూర్ఖత్వాన్ని ధిక్కరిస్తూ, పేదల బలహీనుల కోసం చివరి శ్వాస వరకూ తపిస్తూ, మిషనరీల దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ, వేదాంత సారాన్ని ఆచరణలో చూపిస్తూ… వివేకానందుడు చదువరుల మనసులపై చెరగని ముద్ర వేస్తాడు.

తన దేశాన్ని, సంస్కృతిని గూర్చి తెలుసుకోవాలనుకున్న అందరూ చదవాల్సిన పుస్తకం ఇది. తనను తాను ఏ మతానికీ పరిమితం చేసుకోని ఈ మహానుభావుడి మాటలను మతం పేరుతో ప్రజలకు అందకుండా చేసిన “సెక్యులర్” భారత ప్రభుత్వానికి నేనెoతో ఋణపడి ఉన్నాను. పాఠ్యపుస్తకాల్లో వివేకానందుడి రచనలు ఉండుంటే, భారత ప్రభుత్వం ఆయనకు చెయ్యల్సిన మర్యాద చేసి ఉంటే నేను మిగతావాటన్నిటి లాగే దీనిని కూడా విస్మరించేవాడినేమో! అనుకుంటాం గానీ గంజాయి వనంలో తులసి మొక్కను పట్టడం సులభం ఏం కాదు!

సంబధిత లంకె:  http://www.ramakrishnavivekananda.info/

ఈ పుస్తకాన్ని ఇక్కడ కొనవచ్చు.

Ramakrishna Math
Opposite Indira Park,
Domalguda, Hyderabad – 029.
Phone : 27633936 / 27633937

January 24, 2009 at 3:23 pm Leave a comment



Design a site like this with WordPress.com
Get started