Posts filed under ‘literature’

వెలుతురుబాకు తాకిడికి….

నా అతి తెలివిని భరించలేకనుకుంటా ఒక పెద్దాయన నన్ను 7 తరగతి తర్వాత వేంటనే 10 తరగతి కి దూకెయ్యమని సలహా ఇచ్చాడు, బడిలో ఉండగా. నాకు కూడా సలహా బాగా నచ్చి 7 తరగతి తర్వాత నేరుగా 10 లో చేరిపోయాను. తరగతిలో ఉన్నా మనం పాఠ్యపుస్తకాలనుంచీ, అందులోని అంశాలనుంచీ పెద్దగా నేర్చుకున్నదీ అందులోనివి నిజ జీవితంలో పనికొచ్చినవీ ఏమీ లేవు. కానీ విషయం ఎందుకు గుర్తొస్తుందంటే, 8 లేదా 9 తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని ఒక అద్భుతమైన పద్యాన్ని నేను యాధృచ్చికంగా ఒకసారి చదవడం జరిగింది. పాఠం పేరు, “వివేకానందుని పునరాగమనం“. మొదలుపెట్టిన తర్వాత ఎందుకో పాఠం మొత్తం చదివాను(మామూలుగా పాఠ్యపుస్తకాలు చదవడం అలవాటులేని పని). రచయిత ఎవరో, పద్యాలు ఎక్కడినుంచి సంగ్రహించారో గుర్తులేదు.

కొన్ని కొన్ని విషయాలు సూటిగా గుండెకు తగులుతాయి. విషయాన్ని మెదడు విశ్లేషించే లోగానే, అవి మనిషిమీద చెరగని ముద్ర వేస్తాయి. సరిగా అలాంటి అనుభూతే అందులోని ఒక పద్యం (నిజానికి పూర్తి పద్యం కూడా సరిగ్గా గుర్తులేదు, అసంపూర్ణం గా గుర్తు) ఇప్పటికీ నాకు కలుగజేస్తుంది.

వెలుతురు బాకు తాకిడికి విచ్చిన చిక్కని కాళరాత్రి
గుండెలు ఝిలుఝిల్లున రుధిర నిర్ఝరి పారె
దిగంగనా ముఖమ్ముల నవకుంకుమ ప్రభలు దెండు,
రండు, మేల్కొండు…..

తర్వాత ఇహ గుర్తుకులేదు. కానీ గుర్తున్న మూడు పాదాలూ మనిషి గా నన్నెంత ప్రభావితం చేశాయో మాటల్లో చెప్పలేను. “వెలుతురుబాకు…” ఎంత అద్భుతమైన భావన? ఎక్కడ దొరుకుతుందీ వెలుతురు బాకు?! ఒక్క దెబ్బతో అజ్ఞాన చీకటిని తుత్తునియలు చేసే కాంతి ఖడ్గం!! ఇలా అనిపించేది అప్పట్లో. పాఠం పేరువివేకానందుని పునరాగమనంఅని గుర్తుకు ఉండటం, వివేకానందుడేవరు అని ఆయన పుస్తకాలు కొనుక్కొని చదవడం, అంతకుముందు నేను జీవిస్తున్న నా ప్రపంచాన్ని ఒక్కసారిగా మార్చేశాయి.

ఉపనిషత్తుల లోనో లేక గీత లోనో వెలుతురు బాకులాంటి ప్రయోగం ఉంది. “జ్ఞానఖడ్గంతో అజ్ఞానాన్ని ఛేదించు…” అని.

ఇది రాసుకోవడం నాకోసమే అయినప్పటికీ, ఎవరన్నా టపాను చదవడం జరిగితే, దయచేసి పద్యాన్ని రాసింది ఎవరు? పుస్తకంలోనివి, ఎక్కడ దొరుకుతుంది లాంటి విషయాలు తెలుపగలరు. గుఱ్ఱం జాషువా గారు రాసి ఉంటారేమో అని ఒకసారి విజయవాడ వెళ్ళినప్పుడు పాతపుస్తకాల షాపుల్లో కనిపించిన జాషువా గారి పుస్తకాలన్నీ కొన్నాను. కానీ నేను కొన్నవాటిల్లో లేదు!

************

Update: పైన పేర్కొన్న పద్య రచయిత, దాశరధి – మాహాంద్రోదయం లోనిదీ పద్యం. పద్యమూ దాని తాత్పర్యమూ క్రింద, భైరవభట్ల గారి మాటల్లో-

వెలుతురుబాకు తాకిడికి విచ్చిన చిక్కని కాళరాత్రి గుం
డెలు జిలుజిల్లనన్ రుధిర నిర్ఝరిపారె, దిగంగనా ముఖ
మ్ముల నవకుంకుమప్రభలు మొల్చెను తామర మొగ్గలట్లు, త
ల్పులు తెరువుండు రండు పిలువుండు శయించినవారినెల్లరన్!

“వెలుతురనే బాకుతో చిక్కని చీకటి రాత్రి గుండెలని చీల్చితే, అందులోంచి పారిన రక్తపుటేరు లాగా ఉందిట ఉదయాకాశం. ఆకాశంలో దిక్కులనే కాంతల ముఖాలమీద కుంకుమ కాంతులు విరిసాయట. కింద నేలపై అదే సమయానికి తామర మొగ్గలుకూడా విచ్చుకుంటాయి కదా. పైన ఆ కుంకుమ ప్రభలు కూడా, కిందనున్న తామర మొగ్గల్లానే ఉన్నాయిట! ఇంకేముంది తెల్లవారింది, తలుపులు తెరవండి, రండి, ఇంకా పడుకొని ఉన్నవాళ్ళందరినీ నిద్రలేపండి అని కవి పిలుపు”
(Thanks to Bhaivabhatla)

http://telugupadyam.blogspot.com/2008/12/blog-post.html

December 7, 2008 at 3:19 pm 9 comments



Design a site like this with WordPress.com
Get started