Posts filed under ‘disconnected thoughts’
కొన్ని పరస్పర సంబంధంలేని ఆలోచనలు…
ఇదిలా ఉండగా ఒకరోజు ఎవరితోనో ఈ మాటలన్నీ మాట్లాడుతున్నా.. నా భావాలన్నీ విని ఆయన నన్నో నాస్తికవాది కింద జమకట్టాడు. ప్రతి దాన్నీ విమర్శించడం, ప్రతి దాన్నీ ప్రశ్నించడం, ధిక్కరించడం ఇవన్నీ చూసి. మాటల మధ్యలో “తిరువన్నమలై లో రమణ మహర్షి అనే ఒక గొప్ప వ్యక్తి ఉన్నడు. ఆయనను నడిచే దైవం గా జనం భావిస్తారు. మనం ఆయనను వెళ్ళి కలుద్దామా ఒకసారి?” అన్నాడు.
నాకు ఈ సాధువులనీ, గురువులని దేవుని రూపాలని చెప్పుకుని తిరిగే వారెవ్వరినీ చూడటం ఇష్టంలేదు. ఒక్కరిని చూస్తే చాలదా? నేనెప్పుడూ ఎవరికోసమూ వెదకలేదు. ఎవరికాళ్ళ దగ్గరో కూర్చుని ఉపదేశాలూ తీసుకోలేదు “ఇది చెయ్యి, అది చెయ్యి… సాధన చేస్తూనే ఉండు.. ఒకనాడు లభిస్తుంది” లాంటివి నాకు సరిపోవు. నాకు దొరికినవి లెఖ్ఖలేనన్ని అనుభవాలు. ఆ అనుభవాలు శాశ్వతత్వాన్ని కోరుకుంటాయి. కానీ అలాంటి శాశ్వతత్వం ఎక్కడా లేదు. అందుకే నా దృష్టిలో ఈ సాధువులు, గురువులు అందరూ మోసగాళ్ళు. పుస్తకాల్లో ఉన్నదే వారి మాటల్లో వారు చెబుతారు. పుస్తకాలు నేను చదవలేనా? నాకు అనుభవాలొద్దు. అనుభవాల్లో ఏం తేడా ఉంది? లైంగిక అనుభవానికీ, వీరు చెప్పే ఈ ఆత్మానందానికి తేడా ఏముంది? అన్నీ అనుభవాలేగదా! బ్రహ్మం ఏమిటో అనుభవించాలనే కోరిక నాకు లేదు. మరొకరికెవరికైనా నిజం తెలుసుకోవడం, బ్రహ్మమును అనుభవించటం ఉపయోగకారి కావచ్చునేమో కానీ నాకు మాత్రం కాదు.
ఇలా ఇష్టం లేకుండానే వెళ్ళాను రమణ మహర్షిని చూడటానికి. ఆ వ్యక్తి లాక్కుని వెళ్తే వెళ్లాను. ఆయనక్కడ కూర్చుని ఉన్నాడు. చూడగానే నిపించిది “ఏమిటీ ఇతనా నాకు సహాయం చేయగలిగేది” అని. కూర్చుని కార్టూన్లు చదువుతాడు, కూరగాయలు తరుగుతాడు, దీనితోనో దానితోనో ఆడుకుంటున్నాడు, పిల్లాడి చేష్టలు చేస్తున్నాడు ఇతనా నాకు సహాయం చేసేది? ఇతనా గురువు? సరే ఇంత దూరం వచ్చాం కాబట్టి అక్కడ కూర్చున్నా – ఏమీ జరగలేదు. నేను ఆయన్ని చూసాను, ఆయనా నన్ను చూసాడు. “ఆయన సమక్షంలో నువ్వు ప్రశాంతతను అనుభవిస్తావు, ప్రశ్నలు ఉండవు, ఆయన చూపుతోనే న్నీ నశిస్తాయి” – ఇలాంటివి ఏమీ జరుగలేదు. అదంతా కథగానే ఉండిపోయింది. మదిలో చాలా ప్రశ్నలున్నాయి… రెండు గంటలనుంచీ అక్కడే కూర్చుని ఉన్నా, ఇంకా ప్రశ్నలున్నాయి. సరే ఈయన్ని కొన్ని ప్రశ్నలడుగుదాం అనిపించింది. ఆ సమయంలో నాకు మోక్షం నిజంగా కావాలని ఉండేది, అందుకే ప్రశ్నలు..
“నీవు ఏదయితే సంపాదించావో, ఏదయితే కనుగొన్నావో, దేన్నయితే అనుభవించావో… దాన్ని నాకివ్వగలవా?”
సమాధానం లేదు… కొన్ని క్షణాల తర్వాత మళ్ళీ..
“నీవు ఏదయితే సంపాదించావో, ఏదయితే కనుగొన్నావో, దేన్నయితే అనుభవించావో… దాన్ని నాకివ్వగలవా?”
ఈ సారి సమాధానం వచ్చింది…
“నేను ఇవ్వగలను… నువ్వు తీసుకోగలవా?” (I can give it to you. But, can you take it?)
“……………..”
ఒక శ్రేయోభిలాషి సలహా…
“ఇంకో చిన్న సూచన. వెలుగు ను తెల్సుకుంటే మనం చీకటిని పారద్రోలగలము. వెలుగు వివరాలకోసం యత్నించండి. ప్రపంచం లోని చెడు గురుంచిన వివరాల పైన ఎక్కువ శ్రధ్ధ కనపరచకండి. బాధలో వున్న వాళ్ళకి ఆసరాగా మారండి. కాని, బాధితుల చేతి అస్త్రం గా ఎప్పటికీ మారద్దు. Just be careful.”
అదీ సంగతి!!
వెలుతురుబాకు తాకిడికి….
కొన్ని కొన్ని విషయాలు సూటిగా గుండెకు తగులుతాయి. విషయాన్ని మెదడు విశ్లేషించే లోగానే, అవి మనిషిమీద చెరగని ముద్ర వేస్తాయి. సరిగా అలాంటి అనుభూతే అందులోని ఒక పద్యం (నిజానికి పూర్తి పద్యం కూడా సరిగ్గా గుర్తులేదు, అసంపూర్ణం గా గుర్తు) ఇప్పటికీ నాకు కలుగజేస్తుంది.
వెలుతురు బాకు తాకిడికి విచ్చిన చిక్కని కాళరాత్రి
గుండెలు ఝిలుఝిల్లున రుధిర నిర్ఝరి పారె
దిగంగనా ముఖమ్ముల నవకుంకుమ ప్రభలు దెండు,
రండు, మేల్కొండు…..
… ఆ తర్వాత ఇహ గుర్తుకులేదు. కానీ గుర్తున్న ఆ మూడు పాదాలూ మనిషి గా నన్నెంత ప్రభావితం చేశాయో మాటల్లో చెప్పలేను. “వెలుతురుబాకు…” ఎంత అద్భుతమైన భావన? ఎక్కడ దొరుకుతుందీ వెలుతురు బాకు?! ఒక్క దెబ్బతో అజ్ఞాన చీకటిని తుత్తునియలు చేసే కాంతి ఖడ్గం!! ఇలా అనిపించేది అప్పట్లో. పాఠం పేరు “వివేకానందుని పునరాగమనం” అని గుర్తుకు ఉండటం, ఈ వివేకానందుడేవరు అని ఆయన పుస్తకాలు కొనుక్కొని చదవడం, అంతకుముందు నేను జీవిస్తున్న నా ప్రపంచాన్ని ఒక్కసారిగా మార్చేశాయి.
ఉపనిషత్తుల లోనో లేక గీత లోనో ఈ “వెలుతురు బాకు” లాంటి ప్రయోగం ఉంది. “జ్ఞానఖడ్గంతో అజ్ఞానాన్ని ఛేదించు…” అని.
ఇది రాసుకోవడం నాకోసమే అయినప్పటికీ, ఎవరన్నా ఈ టపాను చదవడం జరిగితే, దయచేసి ఈ పద్యాన్ని రాసింది ఎవరు? ఏ పుస్తకంలోనివి, ఎక్కడ దొరుకుతుంది లాంటి విషయాలు తెలుపగలరు. గుఱ్ఱం జాషువా గారు రాసి ఉంటారేమో అని ఒకసారి విజయవాడ వెళ్ళినప్పుడు పాతపుస్తకాల షాపుల్లో కనిపించిన జాషువా గారి పుస్తకాలన్నీ కొన్నాను. కానీ నేను కొన్నవాటిల్లో లేదు!
************
Update: పైన పేర్కొన్న పద్య రచయిత, దాశరధి – మాహాంద్రోదయం లోనిదీ పద్యం. పద్యమూ దాని తాత్పర్యమూ క్రింద, భైరవభట్ల గారి మాటల్లో-
వెలుతురుబాకు తాకిడికి విచ్చిన చిక్కని కాళరాత్రి గుం
డెలు జిలుజిల్లనన్ రుధిర నిర్ఝరిపారె, దిగంగనా ముఖ
మ్ముల నవకుంకుమప్రభలు మొల్చెను తామర మొగ్గలట్లు, త
ల్పులు తెరువుండు రండు పిలువుండు శయించినవారినెల్లరన్!
వీళ్ళు హీరోలు కారు!
ఎందుకు చేస్తారు వాళ్ళీ త్యాగం? ఇంకో దారి ఉంటే వాళ్ళు కూడా ప్రాణం ఇంత తేలిగ్గా పోగొట్టుకోవడానికి ఇష్టపడరు కదా. మనలాగే టీవీ ల ముందు కూర్చుని, ఒక పిజ్జా ని కోక్ తో అస్వాదిస్తూ ఎంచక్కా దేశ సమస్యలగురించీ, పోరాడేజవానులు చేసిన తప్పుల గురించీ మాట్లాడేవాళ్ళు. మాట్లాడటం సులభమే కదా. లేకుంటే కాపీ పేస్టు పని చేసి అలసిపోయి, ఇంటికి వచ్చి వార్తల్లో దృశ్యాలు చూసీ, బ్లాగుల్లో అభిప్రాయాలు చదివీ తెగ ఉత్తేజితం అయ్యి, “ఈ హెలికాప్టర్నుంచి కిందికి దిగే సిత్రం” మేము కొన్ని వందలసార్లు సూసినాం అని ఎద్దేవా చేసే వాళ్ళు. సరిగ్గా మనం ఉన్న స్థానంలోవాళ్ళూ ఉండటానికి ఇష్టపడేవాళ్ళు.
అసలా జవానులే లేకపోతే?? ఇలా అలోచించడానికి మనం ఇష్టపడం. (అలోచించటానికి మనముంటామా అసలు?)
అవును. విజయాల కోసం పరితపిస్తున్న దేశం ఇది. ఎవరో పోసిన మూసలో అలోచించీ అలోచించీ, విసిగి వేసారిన ప్రజలున్న దేశం. నిద్దరలేచినప్పటి నుంచీ అధః పాతాళానికేసి సాగుతున్న రాజకీయ శునకాల కథలు వినీ, చదివీ, మాట్లాడీ, చర్చించీ విసుగెత్తిన జనం ఉన్న దేశం. మహేంద్ర సింగు ధోని జుట్టు పొడవునీ, మల్లిక షెరావతు లో దుస్తులరంగులనీ గూర్చి చర్చించి, వార్తలు గా ప్రసారం చేసుకుని పబ్బం గడుపుకునే ప్రచార మాధ్యమాలున్న దేశం. అరువుతెచ్చుకున్న సిద్ధాంతాలతో రాజ్యమేలాలనే కుహన లౌకిక శునకాలూ, ఆ సిద్ధాంతాలకు ప్రతి సిద్ధాంతాలు చేసి ఉనికినికాపాడుకోవాలనే హిందూత్వ శునకాలూ విచ్చలవిడిగా తిరుగుతున్న దేశం. హేరోలెక్కడున్నారు??
జీవచ్ఛవాల్లా తిరుగుతున్న ఈ మనుషుల మీదకి ముష్కరులు దాడి చేసినప్పుడు, వీరోచితంగా పోరాడి, చచ్చిపోయిఇంకా మేం బ్రతికే ఉన్నాం అని ఋజువు చేసిన ఈ జవానులది విజయం కాక మరేంటి?
సమస్యల కారణాల వేపు దృష్టి సారించక, సంఘటనానంతర విషయాల్లో రంధ్రాన్వేషషణ చేసేంత గా జనం ప్రభావితులౌతున్నారంటే… శేశేంద్రగారన్నట్లు … “దేశం లో తోక చుక్క పుట్టిందన్నమాటే“. Those who do not remember the past are condemned to repeat it. మనం గతం నుంచి పాఠాలు నేర్చుకోమన్నది చరిత్ర. అదిగత చరిత్ర అయ్యేంతవరకూ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, ప్రాణాలు దూది పింజల్లా ఎగిరిపోతూనే ఉంటాయి.
సంఘ సంస్కర్తలకూ, మేధావులకూ చేతి నిండా పని!!
తెలుగు భాషా వికాసం
నేను అంతర్జాలాన్ని ఉపయోగించడం మొదలుపెట్టిన కొత్తల్లో తెలుగు జాలపుటలు చాలా తక్కువ ఉండేవి. అప్పుడు బ్లాగులు అంత ప్రాచుర్యంలో లేవు. ఇప్పుడు పరిస్థితి కొంచెం మెరుగు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ జాలపుటలు ఉన్నాయి. బ్లాగులూ, జాల సమూహాలూ, చర్చా వేదికలూ మొదలైనవి. ఇక్కడ గమనించాల్సిన అంశం ఒక్కటుంది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు జనులకు ఒక్కసారిగా తెలుగు మీద మమకారం పుట్టుకొచ్చేసిందా? అలా అనుకోవడం తెలివితక్కువ తనమే అవుతుంది. అప్పుడూ, ఇప్పుడూ; ఇంకొచెం ధైర్యం చేసి చెబుతాను, ఇకమీదట ఎప్పుడూ, మాతృభాష మీద మమకారం ఉన్నవాళ్ళు ఉండేవారు/ఉంటారు. అప్పుడూ తెలుగులో రాయాలనీ, తెలుగులో చర్చించుకోవాలనీ ఉన్నవాళ్ళు ఉండి ఉండాలి కానీ వారికి సరైన *ఉపకరణాలు* ఉండేవి కాదు. ఉన్నా, వాటిని ఉపయోగించడం సాధారణ జనానికి బహు కష్టం గా ఉండి ఉండాలి. ఇప్పుడలా కాదు. తెలుగులో టైపు చెయ్యడం సులభం అవ్వగానే ఎంత మంది బ్లాగులు రాస్తున్నారో తెలిసిందే. వెయ్యి చర్చా వేదికలూ, వందలకొద్దీ వ్యక్తులూ సాధించలేనిది ఒక్క లేఖిని లాంటి ఉపకరణం సాధించగలదు. ఈ రకం గా వీవెన్ కు, ఇంకా ఇలాంటి ఉపకరణాలు తయారు చేసిన చాలా మందికీ భాష ఋణపడి ఉంటుంది!!
కొన్నిరోజుల క్రింద యాధృచ్ఛికంగా ఈ బ్లాగును ( a wonderful blog, btw) చూడటంతో మొదలయ్యింది తెలుగు బ్లాగులూ, తెలుగు అంతర్జాల ప్రపంచంతో పరిచయం. మొదట్లో తెలుగు అక్షరాలను స్క్రీన్(తెలుగు లో దీనికీ సమానార్థకం తెలీదు) మీద చూడటం చాలా ఇబ్బందికరం గా ఉండేది. ఏదో బక్క చిక్కిపోయినట్లు గా అగుపించేది తెలుగు, ఇప్పుడు అలవాటైపోయింది! ఇప్పటికీ నా మిత్రులకెవరికైనా లింకులు ఇస్తే వారు చెప్పేది స్క్రీన్ మీద చదవటం కష్టం గా ఉందని. దీన్ని కూడా ఎవరైనా సమర్థులు పరిష్కరిస్తే బాగుంటుందేమో. మొదట్లో “అంతర్జాలం” లాంటి పదాలు, వాడుతున్నప్పుడు కొంచెం చిత్రం గా అనిపించేది కానీ ఒకసారి మెదడు లో నిక్షిప్తం అయ్యాక సాధారణంగానే ఉంది. అందుకే నిక్కచ్చి గా తెలుగును మాత్రమే వాడే కొందరు భాషా చాందసవాదుల అవసరం ఉందిప్పుడు. ప్రపంచానికి కొత్త గా ఏమైనా ఇచ్చేంత తెలివితేటలు లేకపోయినా, అనుభవాలు పంచుకోవాల్సినంత గొప్పవాడిని కాకపోయిన తెలుగులో రాద్దామని, తద్వారా నేర్చుకుందామని మొదలుపెట్టిన ప్రయత్నమే ఈ బ్లాగు, ఇంకొంచెం చెత్త!
తెలుగుభాష పునరుత్తేజం చర్చలు ఊపందుకోవడం చాలా ఆరోగ్యకర పరిణామం! ఏదైనా సమస్యను పరిష్కరించాలి అని అనుకున్నప్పుడు, సమస్య పై పూర్తి అవగాహన ఉండాలి. లేకుంటే, సమస్యను ఎదుటివారికి విశదీకరించి, ఒప్పించి, అనుకున్నది సాధించలేము. తెలుగు భాషా పురోగతి, పునరుత్తేజం గూర్చి మాట్లాడుకునే ముందు, తెలుగు భాషకీ పట్టిన ఈ దుర్గతి కి మూలాలెక్కడున్నాయో అలోచించాలి. అలాంటి అలోచనల నుంచి పుట్టిన పరిష్కారాలు దీర్ఘకాలికాలు.
మనమింకా స్వతంత్రులు అనే విషయం మనం జీర్ణించుకోలేదేమో అనిపిస్తుంది. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాగలగడం గౌరవించదగ్గ, అందరూ అనుసరించాల్సిన సుగుణం అన్న రీతిలో ఉన్నాయి స్థితిగతులు. ఎందుకున్నాయి అన్నదాని గురించి పలు అభిప్రాయలుండవచ్చు, వాటిని గురించి మాట్లాడుకుని ప్రయోజనం లేదు. కానీ, గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మన సమాజం లోని నిమ్న, మధ్యతరగతి (ఆర్థికం గా) వర్గాల తల్లిదండ్రులకు వారి పిల్లలు కాన్వెంటుకు వెళ్ళి, రెండు ముక్కలు ఆంగ్లంలో మాట్లాడి, ఇంజనీరో, డాకటేరో అయ్యి, అమ్రీకా కు వెళ్తే గానీ తమ జీవితం ధన్యం అయినట్లు అనిపించదు. ఇందులో తప్పులేదు. పూర్వం ఇంట్లో సంవత్సరానికి సరిపడా ధాన్యం నిలవచేసినోడు గౌరవనీయుడు, ఇప్పుడు అమ్రీకా కెళ్ళి కాపి/పేస్టు చేసినోడు గౌరవనీయుడు. వీటి రెండిట్లోనూ గమనించాల్సిన ముఖ్య విషయం, ఆర్థిక పరిస్థితులు, గౌరవం కోసం పాకులాడటం.
కాబట్టి, తెలుగు భాషను గానీ, లేక అంతరిస్తున్న ఏ ప్రాంతీయ భాషను గానీ పునరుజ్జీవింపజేయాలనుకున్నవారు ఇక్కడినుంచి మొదలుపెట్టాలి. జనం లో ఆంగ్లం నేర్చుకోవడం, మాట్లాడటం, ఉద్యోగాలు సంపాదించటం అంటే మాతృభాషను విస్మరించడం అన్న నిర్హేతుక అభిప్రాయాన్ని వేళ్ళతో సహా పెకలించాలి. ఆంగ్లంలో మాట్లాడటం బాగా వచ్చినవాళ్ళూ, తెల్లవాళ్ళు ఊసేసిన రెండు సిద్ధాంతాలను ఉటంకించేవళ్ళూ సర్వాంతర్యాములనే భ్రమ ఉంది జనాల్లో. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, పెద్దమనుషులు గా చలామణీ అయ్యే వాళ్ళు కూడా ఇలానే అపోహ పడుతుంటారు. భాష/విజ్ఞానం మనిషిని సర్వాంతర్యామిని చెయ్యదు. సరిగ్గ ఇదే అపోహని పటాపంచలు చెయ్యాలి. ఆంగ్లం మాట్లాడటం, చదవటం ఎంత “అభ్యుదయమో” అనుకున్నచోట, తెలుగు మాట్లాడటం, చదవటం సరిగ్గా రాని వారు పురుగులన్నట్లు చూడబడితే కానీ పరిస్థితులు మారవేమో!
పరాయి భాషకోసం పాకులాడి, అటు తెలుగూ సరిగ్గా రాక, ఇటు ఆంగ్లమూ రాక రెండిటికీ చెడిన రేవడిగా మారిన (నా లాంటి) యువకులకి తెలుగుభాషా వైభవం లాంటివి చెబితే సోది లాగా అనిపిస్తాయి. వాళ్ళ సమస్యలు వాళ్ళకుంటాయి. కొత్త టెక్నాలజీలు నేర్చుకోవాలీ, Fake resume పెట్టాలి, ఉద్యోగం కొట్టాలీ, బాగా కట్నం ఇచ్చే పిల్లను పెళ్ళిచేసుకోవాలి(వాళ్ళ పెద్దలు మావోడికి ఫలానా కట్నం వచ్చిందోయ్ అని చెప్పుకునే అవకాశం ఉండాలి కదా), సమాజంలో గౌరవాన్ని కొనుక్కోవడంలో వాళ్ళు సతమతమౌతుంటారు. ఇక అమ్రీకా కు వెళ్ళిపోయి కాపీ పేస్టు చేసుకుని, తీరిక సమయాల్లో చెత్త తెలుగు సినిమాలు చూసుకునే మన ఇంజనీర్లకూ వాళ్ళ సమస్యలు వాళ్ళకుంటాయి. credit card లు చూసుకోవాలి, H1/GC స్టేటస్సూ.. Fulltime, corp to corp.. వీరికీ తెలుగు భాషావైభవం అని ఉద్భోధలు చేసి ప్రయోజనంలేదు.
సమాజంలో ఏ బాదరబందీలు లేకుండా, హాయిగా జీవనం గడిపే వారూ, చెప్పినది వినే receptive mind ఉన్నవాళ్ళూ, ఎవ్వరంటే – పిల్లలు. ఏం జరిగినా అక్కడినుంచే జరగాలి. మన పిల్లలకీ వారి తల్లులకీ తెలుగు ప్రాముఖ్యాన్ని, అవసరాన్ని మనసుకు హత్తుకునేటట్లు చెప్పగలిగితే, నిజమైన ఫలితాలు సాధించగలరు!
సమాజాన్ని బాగా ప్రభావితం చేయగల్గిన మాధ్యమాలు – చలన చిత్రాలూ, టీవీ, పత్రికలూ. వీరందరూ చొఱవ తీసుకుని వారి ప్రతి చిత్రం/సీరియల్/కామిక్/వార్త లోనూ అంతర్లీనంగా ఈ సందేశం ఉండేటట్లు చెయ్యాలి. ఒక రాజకీయ నాయకుడెవడైనా బలంగా ఈ వాణిని వినిపించాలి.మన వార్తాకలి చానెళ్ళు మిగతా పని చేసుకుపోతాయి.
ఎప్పటిలాగే చెప్పదలచుకున్న విషయాలు చాలా ఉన్నాయి కానీ, వ్యక్తపరిచే భాష సహకరించటంలేదు ఇంకా సమయాభావం. తెలుగులో పట్టుమని ఒక రెండు పుటలు ఏకబిగిన రాయలేని నిస్సహాయత కు సిగ్గు పడుతూ… సెలవు!!
గమనిక: తెలుగు గురించి మాట్లాడుతూ అక్కడక్కడా ఆంగ్లంలో రాయటం “దెయ్యాలు వేదాలు…” అని మొదలెట్టకండి. నాకు సమానార్థకాలు తెలియక రాసినవి అవి.
నమ్మకాలూ, అపనమ్మకాలు, భ్రమలు
పొగను చూస్తాం, నిప్పును వెదుకుతాం. చీకట్లో కర్ర ఉంటుంది, పామనుకుంటాం. నమ్మకాలూ, భ్రమలూ !
మనకున్న నమ్మకాలన్నీ భ్రమలా? కాదు. నమ్మకాల్లో కొన్ని నిజాలు, కొన్ని భ్రమలు. అన్నిటినించి ఈ *కొన్నిటిని* మనం ఎలా వేరు చేస్తాం? అవి నేర్పరు, బడిలో!
సంస్కృతం భాషా పండితులంతా జ్ఞాన సంపన్నులా? సంస్కృతం గాని, తెలుగు గాని భాషలే కదా! భాష నేర్చిన వాడు, భాషా పండితుడు, జ్ఞాని కాదు. (మేధావులు ఇప్పుడు సంస్కృత/తెలుగు పండితులు జ్ఞానులు కాలేరా అని నిలదియవచ్చు.. కావోచ్చండి! మన పండితులతో పాటు గా, అసలు అక్షరమే ఎరుగని రైతన్నలు కూడా జ్ఞానులవ వచ్చు, జ్ఞానులవడానికి సంస్కృతానికి సంబంధంలేదు.), మరి అలాగని మనం వీరిని అగౌరవ పరుస్తామ? లేదు. భాషా పండితులని వారి పాండిత్యానికి శిరసువంచి నమస్కరిద్దాం.
Microbiology గురించి యోగి వేమన నడిగితే ఏం చెబుతాడు? యోగి వేమన ని తత్త్వం అడగాలి. మనిషి మనస్తత్వం అడగాలి. Microbiology రాదని వేమన జ్ఞానాన్ని అవహేళన చేస్తామా?
మనకు తెలియని విషయాలు అలవాటు లేని ఆలోచనా రీతి విషయ సంగ్రహణ లో ఎంత నిర్భంద కారకాలో , మనకు తెలిసిన విషయాలు, అలవాటైన ఆలోచనతీరు అంటే నిర్భంద కారకాలు! అలవాటైన ఆలోచనలు కాబట్టి అవి నిజం అనడం అవివేకం.
commonsense గా చెలామణీ అయ్యే మనకు ఇష్టమైన, మనకు నచ్చే నమ్మకాలూ/అభిప్రాయాలను ప్రాతిపదికగా తీసుకుని గంభీరమైన సమస్యలను అర్థం చేసుకోవాలని/చర్చించాలని చూస్తే, ఆలోచించే జనం తేరిపార చూస్తారు, వివరిస్తారు, విమర్శిస్తారు, చివరగా తిరగబడతారు!!
సంక్లిష్టత, దోపిడి
ఏ విషయం అయితే కాస్త సంక్లిష్టంగా, సామాన్య జనాలకి గజిబిజి గా ఉంటుందో అక్కడ జనాన్ని exploit చేసే ఒక తెగ పుడుతుంది.
Recent Comments