Posts filed under ‘budhdha’
శోణదండా! బ్రాహ్మణుడెవరు??
“గౌతమా! అసత్య దోషములు అంటకుండా , ఒక బ్రాహ్మణుడు “నేను బ్రాహ్మణుడిని” అని నేనిప్పుడు చెప్పబోయే 5 గుణములు ఉండినచో చెప్పగలడు. అవి; మొదటగా, జనన రీత్యా తల్లివైపున గానీ, తండ్రి వైపున గానీ ఏడు తరముల ముందునించీ మచ్చలేని కుటుంబంలో జన్మించినవాడై వుండాలి; రెండు, వేద మంత్రాలనూ, ఇతర శాస్త్రాలన్నిటినీ వంటబట్టించుకున్న విద్వాంసుడై ఉండాలి. మూడు; చూడగానే నమ్మకాన్ని కలిగించే మనోహరమైన రూపం, మేలిమి చాయ కలిగిన వాడై ఉండాలి. నాలుగు; అపారమైన సద్గుణ సంపద కలిగిన వాడై ఉండాలి. చివరగా; సత్యాన్వేషి, సత్యభాషి, జ్ఞాని అయి ఉండాలి. “
“బ్రాహ్మణోత్తమా! ఈ ఐదు గుణాలనుంచీ, ఏదైనా ఒకటి లేకున్ననూ, అసత్య దోషము అంటకుండా, “నేను బ్రాహ్మణుడిని” అని చెప్పగల వీలున్నదా?”
“శాక్య మునీ! అది సంభవమే. రూపాన్ని, మనిషి శరీరపు చాయనూ వదిలి వెయ్యవచ్చు. రూపంలోనూ, చాయలోనూ ఏమున్నది? “
“శోణదండా! ఈ నాలుగు గుణాలనుంచీ, ఏదైనా ఒకటి లేకున్ననూ, అసత్య దోషము అంటకుండా, “నేను బ్రాహ్మణుడిని” అని చెప్పగల వీలున్నదా?”
“గౌతమా! అది సాధ్యమే! వేదాలనూ మంత్రాలనూ తీసివేయవచ్చు. వేద మంత్రాలలో ఏమున్నది. సరైన జననం, సద్గుణం, జ్ఞానం ఈ మూడూ ఉండిన చాలు“
“విప్రా! ఈ మూడు విషయాలనించి , ఏదైనా ఒకటి లేకున్ననూ, అసత్య దోషము అంటకుండా, “నేను బ్రాహ్మణుడిని” అని చెప్పగల వీలున్నదా?”
“గౌతమా! ఆలోచించిన పిమ్మట ఇది కూడా వీలగును! జనన సంబంధమైన విషయాన్ని విదిచివేయవచ్చు. పుట్టుకతో పని ఏమున్నది? సద్గుణం, జ్ఞానమే కదా బ్రాహ్మణులెవరో నిర్ణయించేది!!”
” అయితే, శోణదండా! ఈ రెండింటి నించి, ఏదైనా ఒకటి లేకున్ననూ, అసత్య దోషము అంటకుండా, “నేను బ్రాహ్మణుడిని” అని చెప్పగల వీలున్నదా?”
“లేదు! లేదు!! గౌతమా.. సద్గుణములున్నచోటనే జ్ఞానం ఉంటుంది. జ్ఞానమున్నచోటనే సద్గుణం ఉంటుంది, ఈ రెండింటిలో దేనినీ విస్మరించి బ్రాహ్మణులు కాజాలరు”
“శోణదండా! అవును! ఇదే నేను మీకు చెప్పదలచినది. సద్గుణము లేని జ్ఞానము లేదు, జ్ఞానము లేక సద్గుణము లేదు. ఈ రెండింటి కలయిక ప్రపంచంలో అత్యుత్తమమైనది గా చెప్పాబడుతుంది . ఇవి ఉన్నవారే *నిజమైన బ్రాహ్మణులు* “
**** ****
ఇది “శోణదండ సుత్త” కి సంక్షిప్త, స్వేచ్ఛానువాదం. గౌతముడూ మరియు శోనదండుడనే బ్రాహ్మణుని మధ్య సంభాషణ. ఎంత అద్భుతంగా ఉంది కద!!
దీన్ని ఒకసారి జాగ్రత్తగా చదివితే, గౌతముడు ఏం చేస్తున్నాడో అర్థం అవుతుంది . బ్రాహ్మణులందరూ చేరిన ఒక ప్రదేశంలో, అక్కడున్న వారిలో విద్వాంసుడు యోగ్యుడు, సద్గుణ సంపన్నుడూ అయిన బ్రాహ్మణునితో “నిజమైన బ్రాహ్మణుడెవరని” ప్రశ్నించడం తెలుస్తుంది.
సరిగ్గా ఇదే సంవాదాన్ని అడ్డుపెట్టుకుని చరిత్ర కారులు, “బ్రాహ్మణిజం పైన గౌతమ బుధ్ధుడు తిరుగుబాటు చేశాడు.” అని రాశారు. దాన్ని చదివి మతిపోగొట్టుకున్న మన మేధావులు కొందరు “కుల వ్యవస్థ” పైన బుధ్ధుడు తిరుగుబాటు చేశాడని వారికి వారు అనేస్కుంటారు. సంతోషం!! కానీ అంతటితో ఊరుకోరు, ఇలాంటి భావాలు కాలక్రమేణా పాఠ్యాంశాలవుతాయి. ఇలాంటి భావజాలాలున్నవారు రాజ్యాంగాలూ రాస్తారు!
అసలు తిరుగుబాటు అంటే ఏంటి? దీనిని తిరగబడ్డం అంటార? కార్ల్ మార్క్సు కాపిటలిజం మీద బూర్జువా సిధ్ధాంతాలమీదా తిరగబడ్డాడు. ఎలా తిరగబడ్డాడు? తనదైన ఒక కొత్త సిధ్ధాంతాన్ని ప్రతిపాదించి. అంతే కానీ తను చెప్పేది “నిజమైన” కాపిటలిజం అని కాదు. కాల్విన్ కాథొలిక్కుల మీద ఎలా తిరగబడ్డడు? “మీరు నిజమైన కాథొలిక్కులు కాదు” అని చెప్పి కాదు . మీ చర్చి డెవిల్ చర్చి అని చెప్పి తిరగబడ్డడు. మరి నిజమైన బ్రాహ్మణుడెవరో చెప్పే గౌతముడు, తిరుగుబాటుదారుడెలా అయ్యడు?
మేధావులు, సమాజపు తీరుతెన్నుల ను ప్రభావితం చెయ్యగల స్థితిలో ఉన్నవారూ అత్యంత భాద్యతాయుతంగా నడుచుకోవాలి. రాబోయే తరాల బుర్రల్లో విషం నింపబోయేముందు క్షణకాలం విచక్షణ ఉపయోగించి చూడాలి. మనిషి ఎంత గొప్పవాడైతే, వాడు చేసే తప్పొప్పుల పర్యవసానాలు అంత తీక్షణంగా ఉంటాయి.
Recent Comments