We, humans are intrigued by things that are new.
An adage goes “heard melodies are sweet, but those unheard are sweeter!”
The unseen brings hope, aspirations and a possibility of that ultimate human pursuit …. Happiness!
Hopes, by the way, never alter realities.
We have learned many such lessons in the past, and sure life has many in store for each of us.
For now, lets enjoy this moment while it lasts..
Carpe Diem! seize the day!!
Friends, I wish ya health, wealth and knowledge this new year!!
December 31, 2008 at 3:10 pm
అనగనగా ఒక ఊళ్ళో ఓ నిరుపేద విద్యార్థి ఉండేవాడు(మామూలు గా బ్రాహ్మణుడుండేవాడు, కానీ ఇలా రాస్తే మన సంస్కర్తలు ఒప్పుకోరు. చరిత్ర తిరగేసి మరీ చీరేస్తారు!) సరే, కథలోకొద్దాం! మన పేద విద్యార్థిది తన కుటుంబాన్ని కూడా సరిగ్గా చూసుకోలేని ఆర్థిక పరిస్థితి. కానీ గొప్ప పండితుడు. శాస్త్రాలన్నీ అవపోశన పట్టాలని కోరిక గలవాడు. దినమంతా కష్టపడి పని చేసి సంధ్యవేళ తన అర్ధాంగిని కూర్చోబెట్టుకుని, శాస్త్రాల్లోని మంత్రాలను వల్లెవేసి ఆమెకి వినిపించేవాడు.(ఇప్పట్లో లా టీవీ సీరియళ్ళు లేవు కాబట్టి, ఆమె కూడా శ్రధ్ధగా వినేది అనుకుందాం.)
ఒక సంధ్య వేళ ఎప్పటి లాగానే, తన భార్యకు ఈయన మంత్రాలు వల్లె వేయటం మొదలెట్టాడు తేడా ఏంటంటే ఆమె ఇప్పుడు ఒట్టి మనిషి కాదు. ఆ మoత్రాలను ఆమెతో పాటు గా గర్భస్థ శిశువు కూడా వింటున్నాడు! విన్నవాడు ఊరుకున్నడా ఊఁహు! ఊరుకుoటే మనం కథెందుకు చెప్పుకుంటాం? “మీరు పలికే మంత్రం మీద ధ్యాస ఉంచండి. మీ ఉఛ్ఛారణలో దోషం ఉంది.” అన్నాడు. పాపం ఇంకా ప్రపంచంలోనికి అడుగుపెట్టలేదు కద, ఆయనకి ఇక్కడ రూల్సు తెలియవు. ఇక్కడ *పెద్దవాళ్ళు* ఎంత పెద్ద తప్పు చేసినా, కారణాలు ఉన్నకుడా, సవినయంగా అయినా కూడా “మీది తప్పు” అని చెప్పకూడదు. చెబితే ఏంజరుగుతుంది? *పెద్దవాళ్ళు* విచక్షణ కోల్పోతారు. “నీకేం తెలుసురా, నిన్నగాక మొన్నొచ్చావ్, కుఱ్ఱకుంకవి” అని విసుక్కుంటారు, కొండొకచో శపిస్తారు. ఇక్కడా అదే జరిగింది. ఇంకా జన్మించని ఒక పసిగొడ్డు మాటలాడటమే విచిత్రం, అలాంటి మాటలు నన్నెందుకు విసిగిస్తున్నాయి అని ఒక్క క్షణమైనా అలోచించకుండా, ఉద్రేకంలో ఆ బిడ్డని శపించాడు. అసలే సత్యాన్వేషి, సుకర్మల ఫలితంగా మాటకు వచ్చిన శక్తి పని చేసింది. ఆ బిడ్డకి జన్మతః శరీరం మీద ఎనిమిది వంకర్లు వచ్చాయి. అందుకే ఆయన పేరు ఆష్టావకృడు.
ఇంక కథ కొంచెం సీరియస్. అష్ట వంకర్లతో పుట్టిన వారిని సమాజం మామూలుగా బ్రతకనిస్తుందా చెప్పండి? ఆడుగడుగునా హేళనలే, వైకల్యంతో పుట్టిన వారు సమాజంలో వినోదవస్తువులుగా చూడబడతారు(ఇప్పుడు మన మానవ హక్కుల సంఘాలు ఇంకో రకం గా హింసిస్తాయి, కడవలు కడవలు గా వారి మీద జాలి చూపించి, వారి వైకల్యాన్ని అనుక్షణం గుర్తుచేసి; ఇది ఇంకో విషయం!). అయినా ఆయన ఇవేమీ పట్టనట్లు ఉండేవాడు. ఎందుకంటే ఆయన సర్వం తెలిసిన జ్ఞాని. ఆయన ప్రపంచాన్ని చూసే చోటునుంచి వెక్కిరించే ఆకతాయిలకూ, ఆరాధించే శిష్యులకూ తేడా కనిపించదు కాబట్టి.
అత్యుత్తమమైన జ్ఞానాన్ని సరళమైన భాషలో, సూటిగా అందరికి చెప్పాలనే ఆయన జన్మించారు. అలా చెప్పటానికి రాజదర్బారు కంటే వేరొక మంచి చోటు ఉంటుందా?! అందుకని, ఓ మంచిరోజు చూసుకుని(ఏదో మాటవరసకి లెండి, మంచిరోజులు మనకి కావాలి గానీ, జ్ఞానులకెందుకు?)అప్పటి రాజు జనకుని ఆస్థానానికి బయలుదేరాడు. జనకుడంటే మన రాముడిగారి మామగారు కాదండోయ్, ఈయన ఇంకో జనకుడు.మన నాయకుడికి శరీరం సహకరించదు. అసలే ఎనిమిది వంకరలతో జన్మించాడు! జ్ఞానులకు అవేవో శక్తులుండవా ఎక్కడికనుకుంటే అక్కడికి వెళ్ళిపోవడానికి అన్న చెత్త సందేహం నాకూ వచ్చింది. అదే ప్రశ్న మా నాన్నమ్మ ని అడిగా, నన్నోసారి తేరిపార చూసి “ఎందుకుండాలి శక్తులు? అయినా మాయలూ మంత్రాలూ చేసేది ఐంద్రజాలికుడు రా నాయనా, జ్ఞానులు గాదు” అని సుతిమెత్తగా తిట్టింది. ఛీ! ఎదవ సదువు ఈమాత్రం జ్ఞానమూ లేదు అని తిట్టికున్నా!! ఎక్కడికో వెళ్ళిపోయాం. సరే, మళ్ళీ కథలోకి. మామూలుగా అందరికీ ఒకరోజు పట్టే ప్రయాణం మన కథనాయకుడికి ముప్పయి రోజులు పట్టింది. అర్థం చేసుకోదగిందే!!
చివరాఖరికి మన నాయకుడు జనకుని కొలువు చేరుకున్నాడు. నిండు సభ, రోజువారీ కార్యక్రమాల్తో అందరూ తెగ బిజీ గా ఉన్నారు. ఈయన రూపం, నడకతీరూ చూసి సభాసదులు నవ్వసాగారు. విచక్షణ లేశమైనా లేనివారు మొదలుపెడితే, వారిని చూసి కొందరు, అందురూ నవ్వుతున్నారని ఇంకొందరు.. ఎందుకు నవ్వుతున్నామో తెలియకుండా మరికొందరు. “ఎవడీ పిచ్చి వాడు?”, “వాడి శరీరంలో ఎన్ని వంకర్లో చూడు” “వంకర తిరిగిన ఆ పాదాల్ని చూడు”, “వాడి దుస్తుల్ని చూడు”. పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. నిర్వేదంగా నిల్చున్నాడు అష్టావకృడు, అందరూ సద్దుమణిగేవరకూ నిశ్చలంగా ఉన్నాడు. వెంటనే ఒక్కసారిగా, గాఠ్ఠీగా నవ్వడం ప్రారంభించాడు. సభమొత్తం దద్దరిల్లిపోయేటట్టు. అవును మరి, శరీరంలోని వంకరలు చూసే అంతగా నవ్వితే, బుధ్ధిలో వంకరలు చూసి సర్వజ్ఞులకు ఇంకెంతగా నవ్వు రావాలి?
సహజంగానే నవ్విన వాళ్లంతా ఖంగు తిన్నారు! రాజు సహా!! “ఇంతమంది నిన్ను చూసి నవ్వుతున్నారు, సిగ్గుపడాల్సింది పోయి ప్రతిగా నువ్వెందుకు నవ్వుతున్నావ్?” అన్నాడు జనకుడు. “నీ లాంటి గొప్ప విద్వాంసుడు, గొప్ప రాజూ ఇంతమంది చెప్పులుకుట్టేవాళ్లను చుట్టూ ఎందుకు ఉంచుకున్నాడా అని అలోచిస్తే నవ్వు వస్తోంది! నువ్వూ చెప్పులుకుట్టే వాడివే, రాజా” అన్నాడు. సభలో నిశ్శబ్దం! ఇంతెకుముందు రాజుతో ఎవ్వరూ అలా మాట్లాడలేదు! అష్టావకృడే కొనసాగిస్తూ “ఎందుకంటే, చెప్పులుకుట్టేవాడే చెర్మానికి విలువ కడతాడు. వాడికి అంతకంటే అలోచించే అవసరం ఉండదు, అలాగే మీరందరు నా చెర్మాన్నీ, ఆకారాన్నీ చూసి నేనటే ఎమిటో అంచనాకు వస్తున్నారు” అప్పుడు అర్థం అవుతుంది జనకుడికి, అష్టావకృడికి తను ఏమి మాట్లాడుతున్నాడో దాని గురించి బాగ తెలుసని! స్వతహాగ విద్వాంసుడు అయి ఉండతం చేత అష్టావకృడిని గుర్తించి, ఆయనతో సంవాదం మొదలు పెడతాడు జనకుడు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ పేరే, అష్టావక్ర గీత!
అష్టావక్ర గీత మన భగవద్గీత కంటే 5000 సంవత్సరాల పురాతనమైనది. చెప్పదలుచుకున్న విషయాన్ని, సూటిగా, శషభిషలు లేకుండా చెబుతాడు అష్టావక్ర. స్వామి నిత్యానంద చెప్పినట్లు, మనం కృష్ణుడి ని పూజిస్తాం, కానీ ఎవ్వరూ అష్టావకృడిని పూజించరు, కృష్ణుడిని పూజించినట్లుగా. కాబట్టి, వ్యక్తికంటే వారు చెప్పిన విషయాలకు మనం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది, అష్టావకృడి విషయం లో.
November 17, 2008 at 8:55 pm
తగదు తగదటంచు తగువారు చెప్పిన
వినడు మొఱకు చెడును గొనకు నిజము,
మునులు చెప్పు ధర్మముల మీరనింతెకా
విశ్వదాభిరామ వినురవేమ!
మూర్ఖులకు మౌనమే అలంకారం అని భర్తృహరి అన్నారట. కానీ మనం వినం. వింటే మూర్ఖులమెలా అవుతాం? భర్తృహరిచెప్పింది వినేసేసి మౌనంగా ఉండిపోతే మనం నిజ్జెంగానే మూర్ఖులమని తెలిసేది ఎలా? అదీ సంగతి!! అందుకే నాకూ ఒకబ్లాగూ. ఇంకో గొంతు, ఇంకొంచెం చెత్త!!
దీనిని ఎవ్వరయినా చదవడం జరిగితే:
పైన ఉటంకించిన ‘మనం‘ అనగా *నేను*
తెలుగు లో టైపు చెయ్యడం చాల సరదా గ ఉంది. లేఖిని ని రూపొందిచిన వారికి (వీవెన్?) నా కృతజ్ఞతలు!! బాగాఅనుభవం ఉన్నవారు, లేఖిని లో అర సున్న ఎలా టైపు చెయ్యలో చెప్పగలరా? చెప్పబోయే వారికి ముందుగానేకృతజ్ఞతలు!!
disclaimer కి తెలుగు పదం ఏంటండీ??
November 17, 2008 at 5:21 am
Recent Comments